Sundar C: విశాల్ తో నాకు స్నేహం కుదరడం ఓ కథలాంటిది..! 21 h ago
ఒకానొక టైం లో హీరో విశాల్ ను అపార్ధం చేసుకున్నానని తమిళ దర్శకుడు సుందర్ సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాల్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'మదగజరాజ' మూవీ ప్రొమోషన్స్ లో ఈ విషయాన్ని పంచుకున్నారు.
"విశాల్ తో నాకు స్నేహం కుదరడం ఓ కథలాంటిది. నా భార్య ఖుష్బూ, విశాల్ మంచి స్నేహితులు. కానీ, నాకు అతడితో పెద్దగా పరిచయం లేదు. ఒకానొక సందర్భంలో విశాల్ తో సినిమా చేస్తే బాగుంటుందని నేను, ఖుష్భూ అనుకున్నాం. దాంతో నిర్మాణ సంస్థ ద్వారా అతడితో మీటింగ్ కు అపాయింట్మెంట్ తీసుకున్న. నా అసిస్టెంట్ రైటర్ తో కలిసి చెప్పిన చోటుకి వెళ్తుండగా విశాల్ అక్కడి నుంచి బయటకు వెళ్తుండగా గమనించాం. కానీ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరో అయ్యి ఉంటారులే అని అనుకున్నాం. తీరా అక్కడికి వెళ్లి చుస్తే విశాల్ లేడు. కోపంతో ఇంటికి తిరిగొచ్చాక ఖుష్బూ కి జరిగిన సంగతి చెప్పా. ఆమె విశాల్ ని సమర్ధించింది. తను కాల్ చేసి విశాల్ తో మాట్లాడతా అని అంటే నేను వద్దని చెప్పా.
ఇదంతా గడిచిన రెండు నెలల తర్వాత నేను ఓ సన్మాన కార్యక్రమానికి వెళ్ళాను. విశాల్ కూడా అక్కడికి వచ్చాడు. నేను అతనికి దూరంగా ఉండే ప్రయత్నం చేశా. కానీ, మంచి మనసు ఉన్న అతడు కొందరితో కలిసి నా దగ్గరకు వచ్చి సారీ చెప్పాడు. ఆ రోజు తనకు బాగా దగ్గరి వారికి మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో విశాల్ ఆ మీటింగ్ కు హాజరవ్వలేదని తెలుసుకున్నా. నేను చాలామంది హీరోలతో పని చేశా. వారిలో కార్తీక్ నాకు అన్నయ్యలాంటివారు. విశాల్ నాకు తమ్ముడి లాంటి వాడు" అని సుందర్ సీ తెలిపారు.